నల్లగొండ: తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా రామాపురం(కోదాడ), నల్లగొండ జిల్లా పొందుగుల(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణలోకి అనుమతించడంలేదు. తెలంగాణలోని ఆసుపత్రుల్లో రెఫరెన్స్ లెటర్, బెడ్ కన్ఫర్మ్ ఉంటేనే కోవిడ్ పేషేంట్స్‌లకు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే విధుల్లో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. అటు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు మే 18 వరకు ఉన్నాయి.
కాగా హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా చెప్పుకుంటారు. ఇక్కడికి ఏపీ, తెలంగాణ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం చేయించుకునేందుకు వస్తుంటారు. చికిత్స చేయించుకుని కోలుకుని స్వరాష్ట్రాలకు వెళ్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బోర్డర్‌లో ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్ వాహనాలపై ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు.