తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరిన్ వరకు గాలులతో ఉపరితల ద్రోని 1500 మీటర్ల ఎత్తున ఏర్పడిందని, దీనికి తోడు రుతుపవనాల కదలికలు కూడా సాధారణంగా ఉన్నాయని తెలిపింది.
వీటి ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, నదులు పొంగే అవకాశం ఉన్నందున పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయట తిరగొద్దని సూచిస్తున్నారు.