నాగార్జున సాగర్ మరియు బుద్ధవనం అభివృద్ధికి ₹100 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నల్గొండ ఎంపీ విజ్ఞప్తి చేశారు. నల్గొండ లోక్సభ ఎంపీ రఘువీర్ రెడ్డి కుందూరు, నేడు న్యూ ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వారి అధికార నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ మరియు బుద్ధవనం అభివృద్ధి కోసం “స్వదేశ దర్శన్ పథకం 2.0” క్రింద ₹100 కోట్లను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సంధర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ “చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలను గ్లోబల్ టూరిజం గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఎత్తిపోతల జలపాతం, నాగార్జున కొండ, మరియు బుద్ధవనం వంటి ప్రధాన ఆకర్షణల అభివృద్ధి, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈకో-ఫ్రెండ్లీ నివాసాల అభివృద్ధి తో పాటు, జాతీయ-అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఈ ప్రాంతాల అభివృద్ధి స్థానిక ఉద్యోగావకాశాలు పెంచడంతో పాటు తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నానన్నారు.కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారని ఎంపీ రఘువీర్ రెడ్డి తెలిపారు.