ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రణీత్ రావుకు ఈ నెల 26 వరకు 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం ఆయణ్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐబీ కార్యాలయంలో డేటా ధ్వంసం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ప్రణీత్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి సిరిసిల్లలోని ఆయన నివాసంలో ప్రణీత్‌ను అరెస్ట్ చేశామని పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారణ ప్రారంభించామని వెల్లడించారు. విచారణలో ఇతరులతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ ఒప్పుకున్నారని చెప్పారు. కాగా కేసు దర్యాఫ్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.