ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నట్లు వెల్లడించారు. మరి రద్దయిన రైళ్ల వివరాలు తెలుసుకుందామా?
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న, పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న రద్దయినట్లు చెప్పారు.
సికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి. ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న.. గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న రద్దైనట్లు అధికారులు వెల్లడించారు.