నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించ లేదని చెప్పారు.
“హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాంతంత్ర్యం వచ్చింది. సర్దార్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలు విముక్తి పొందారు. దేశమంతటికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం, రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి. ప్రధాని మోదీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు.” – అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఆనాడు సైనిక చర్య 109 గంటల పాటు అవిశ్రాంతంగా జరిగిందని అమిత్ షా గుర్తుచేశారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎందరో సైనికులు ప్రాణాలు అర్పించారని తెలిపారు. రజాకార్లు గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయ్నారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని.. ఆ ఘటనలో ఎంతో మంది నేలకొరిగారని పేర్కొన్నారు.