ఐటీఐ లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్టు సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీ ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి, కార్మిక శాఖ అధికారులతో తాజాగా సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చుతున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు.
ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్ గ్రేడ్ చేయాలని.. సిలబస్ మార్పునకు ఓ కమిటీ నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. అవసరం అయితే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేవిధంగా విధి, విధానాలు రూపొందించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.