భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఆర్ఓఆర్ – 2020 ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ.. కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకపై రాష్ట్రంలో ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమలులోకి రానుంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం – 2024 పేరుతోనే అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుని సభ ఆమోదించింది. ఇక ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయనుంది ప్రభుత్వం. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలమ్ ను మళ్లీ తీసుకురానున్నారు.
దీని ద్వారా చాలామంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని తెలిపారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.