తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. నేడు లింగోజి కూడా కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డిని పరామర్శించిన సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ అధికార పార్టీ అరాచక పాలన సాగిస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన పార్టీ ప్రచార వేదికలుగా మార్చుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ అధికార పార్టీ అరాచక పాలన సాగిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో గెలిచి నేడు అదే కార్యకర్తలపై తన అనుచరులను ఉసిగొల్పడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. సోనియాగాంధీ చలవతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారని అన్నందుకు దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న దాడులను గుర్తుపెట్టుకుంటున్నామన్నారు. అధికార మదంతో రెచ్చిపోతున్న వారికి అతి త్వరలో ఆయా నియోజకవర్గ ప్రజలతో కలిసి ఈ దాడులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు.