మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల కోడ్ రానుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ రాకముందే హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్ గూడ కూడలిలో నిర్మించిన రెండో స్థాయి పై వంతెనను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలతో కలిసి ఈ వంతెనను సీఎం ప్రారంభిస్తారు. 148.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పైవంతెన శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి వైపు నుంచి బీఎన్ రెడ్డి నగర్, నాగార్జునసాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్టు అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం రెండు లూప్లునిర్మాణంలో ఉండగా పై వంతెన నేటి నుంచి అందుబాటులోకి రానుంది.