హైదరాబాద్లో వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేశుడి తర్వాత అందరికి గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడు. ఈ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుూ ఉంటుంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 28 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోన్న లడ్డూ వేలంపాట… 1994 లో 450 రూపాయలతో మొదలైంది. ఎక్కడా లేని విధంగా వందల, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంటుంది.
గతేడాది స్థానికుడైన వంగేటి లక్ష్మారెడ్డి 24 లక్షల 60 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది వేలంపాటకు సర్వం సిద్ధమైంది. ఉదయం 6 గంటలకు గ్రామంలో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు మొదలైంది. ఉదయం 8.30 గంటలకు బాలాపూర్ గణేశుడి గ్రామ ఊరేగింపు పూర్తవుతుంది. ఇక 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం కానుంది. గంటన్నరపాటు ఆసక్తికరంగా లడ్డూ వేలంపాట సాగనుంది. 10.30 గంటలకు వినాయక సాగరానికి బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర సాగుతుంది.