హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన కురవడంతో ఇన్నాళ్లూ ఉక్కపోతతో విలవిలలాడిన జనం ఊపిరిపీల్చుకున్నారు. ఇక భారీ వాన పడటం వల్ల నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
మరోవైపు భారీ వర్షానికి ఛార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. గంటపాటు కురిసిన భారీ వర్షంతో పెచ్చులు కూలాయి. వర్ష ప్రభావం కారణంగా ఛార్మినార్‌లోని ఒక మీనార్‌లో పెచ్చులు కూలాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపున ఉన్న మీనార్‌లోని చివరి భాగంలో పెచ్చులు కొంత రాలిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.