ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. పైగా జరిగే ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవన్నారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపిందుకు కూడా సిద్ధమన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఈరోజు ప్రకటన విడుదల చేశారు.
తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని కోరారు.
ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా పైసలు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం అమానవీయమన్నారు.