కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ధనసరి సీతక్కపై సినిమా తీస్తానని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. నమ్ముకున్న ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఓ అభిమాని అడవిలో అన్న, లీడర్ సినిమాలు కలిపితే నిజజీవితంలో సీతక్క సినిమా అవుతుందని.. మీరు తీయాలన్నా అంటూ కామెంట్ చేశారు.
దీంతో స్పందించిన బండ్ల గణేష్.. అద్భుతమైన సలహా.. తప్పకుండా ఆలోచిస్తానని కామెంట్ చేశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళ నక్సలైట్ గా, దళం లీడర్ గా పనిచేసిన సీతక్క వివిధ హోదాలలో దాదాపు రెండు దశాబ్దాల విప్లమోద్యమ జీవితం గడిపారు. అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చాక ఆమె ఎల్ఎల్బి చదివి సామాజిక సేవలో చెరుకుగా పాల్గొని కొంతకాలం తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా టిడిపి తరఫునుండి పోటీ చేసి గరిపొందారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.