హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో పీఎస్‌పై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. ఇన్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఠాణా నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించి.. దాదాపు 20 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.
మామూళ్ల కోసం పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణాలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఇన్‌స్పెక్టర్, ఎస్సై, హోంగార్డుపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు చేసిన పబ్ నిర్వాహకుడిని అర్ధరాత్రి పిలిపించి వాంగ్మూలాన్ని తీసుకుని.. పబ్ వ్యవహారంతో పాటు మిగతా వసూళ్ల పైనా ఆరా తీసినట్లు సమాచారం. పబ్‌లు, స్పా సెంటర్ల్ నుంచి నెలవారీ మామూళ్ల రూపంలో సీఐ నరేందర్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని విచారించారు. ఈ మేరకు నరేందర్‌కు ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డ్ శ్రీహరి సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.