తెలంగాణ ఆడపడుచుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగ కానుకగా తీసుకువచ్చిన కార్యక్రమం బతుకమ్మ చీరల పంపిణీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది 354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జరీతోపాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారు చేయించారు.
బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ఈ నెల 4వ తేదీ నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారు చేయించారు. చౌకధర దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రకాల ఆకర్షణీయ రంగులు, థ్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచులు)తో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందని అధికారులు తెలిపారు.