తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం వద్ద డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కానీ ఇప్పటివరకు మనమంతా భావించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఆవిష్కరించడం లేదు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. తయారు చేయించిన ఈ విగ్రహం 24 పీట్లు ఉన్నట్టు సమాచారం. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి. అదేవిధంగా మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటివరకు మనం చూసిన విగ్రహంలో బతుకమ్మ కనిపించేది. కానీ తాజాగా విడుదలైన నూతన విగ్రహం నమూనాలో బతుకమ్మ మాయం అయింది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు.