ఎన్నికల వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ నందినగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈ రోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదన్నారు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు.
తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు చెప్పారు. గత ఎన్నికలు సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. ఆరు గ్యారంటీలో ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని గుర్తించాలి.. అని విమర్శించారు. ఆయన ప్రభుత్వ పనితీరు పైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యల పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై, ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.