తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుపు తీరాలకు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే రానున్న కొత్త సర్కార్ తమకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తుందో లేదోనని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.
జడ్చర్ల పురపాలిక నిమ్మబావిగడ్డ వెనక ఉన్న ఎర్రగుట్ట వద్ద రూ.33 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వం 400 రెండు పడకగదుల ఇళ్లు నిర్మించింది. జూన్ 8వ తేదీన కేటీఆర్ ఇళ్లను ప్రారంభించి ఐదుగురికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి లబ్ధిదారుల వివరాలు సేకరించారు. ఈలోగా ఎన్నికల నియమావళి అమల్లోకి రావటంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో తమకు ఇళ్లు వస్తాయో లేదోనన్న ఆందోళనతో మూకుమ్మడిగా సదరు ఇళ్లలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.