వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1. 37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మూడు గేట్లు ఎత్తి 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి వదులుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం విపరీతంగా పెరుగుతుంది. రెండు రోజుల క్రితం 23 అడుగులుగా ఉన్న నీటిమట్టం ఈరోజు ఉదయం ఏడు గంటలకు 40.7 అడుగులకు చేరుకుంది.

దాదాపు ఏడు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ఇదిలా ఉండగా… వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం పాపికొండల యాత్రను నిలిపి వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో బోటింగ్ ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాపికొండల యాత్రకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా గత కొద్దిరోజుల నుంచి వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులలో నీటిమట్టం పెరుగుతోంది. నదులలో నీటి ప్రవాహం ఎక్కువ అవుతోంది.