భద్రాచలంలో ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాములవారి ఆలయం ముస్తాబవుతోంది. రంగురంగుల విద్యుత్తుదీపాలు నడుమ ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సీతారాముల కల్యాణానికి సుమారు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు భద్రాచలం రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం వసతి, తాగునీరు, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీతారాముల వివాహానికి హాజరు కావాలని ఇంఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. వేద పండితులు రాజపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గవర్నర్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీస్థాయిలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17వ తేదీన ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.