తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. డబుల్ డిజిట్‌పై కన్నేసిన రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ రెండు పార్టీలు సమాన సీట్లలో గెలుపొందారు. జాతీయ నాయకులను రంగంలోకి దించి మరీ హోరాహోరీగా ప్రచారం చేపట్టినా.. ఓటర్లు మాత్రం ఎవరికీ పూర్తిస్థాయిలో ఆధిక్యం కట్టబెట్టలేదు. 17 స్థానాల్లో అధికార కాంగ్రెస్ 8 గెలుచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి స్థానాలు గెలవగా.. ప్రస్తుతం పుంజుకున్న అధికార పార్టీ ఏకంగా 8 సీట్లను కైవసం చేసుకుంది.
మరోవైపు గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసిన బీజేపీ… ఈసారి 8 స్థానాలు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని అసదుద్దీన్ ఒవైసీ సొంతం చేసుకున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, చేవెళ్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.