టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ అంశంపై టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని బీజేపీ స్పష్టంగా చెబుతోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్‌కు ఇవ్వాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఇవాళ.. హైకోర్టు విచారణ జరపనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి విచారణ చేయనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతివ్వకూడదని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. 2022 ఆగస్టులోనే ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ తెలంగాణలో ఏ కేసునూ దర్యాప్తు చేయకూడదు.