శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, వాటికి ఇప్పటినుంచే సమాయత్తం కావాలని సూచించారు. 16 స్థానాల్లోనూ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఇందులో భాగంగానే జనవరి 3 నుంచి 26వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించనుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని, నూతనోత్సాహంతో ముందుకుసాగాలని కేటీఆర్ నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన చోట అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా ఉంటారని స్పష్టం చేశారు. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీ రంజిత్‌రెడ్డినే పార్టీ అభ్యర్థి అని ప్రకటించిన కేటీఆర్.. వెంటనే ప్రచారం ప్రారంభించాలని చెప్పారు.