తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. హుస్నాబాద్‌లో ప్రచారం ప్రారంభించిన గులాబీ దళపతి జనగామ, భువనగిరిలో పర్యటించారు. ఇవాళ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల.. హరీశ్‌రావు నియోజకవర్గం సిద్ధిపేటలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు.
మరోవైపు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తున్నారు. ఆదివారం 69, సోమవారం 29 మందికి….సీఎం కేసీఆర్ బీఫారాలివ్వగా.. మిగిలిన 21 మందికి ఇవాళ బీఫారాలు ఇవ్వనున్నారు. ఇంకోవైపు ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇవాళ మిగతా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఈ క్రమంలో మల్కాజిగిరి, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు వీడనుంది. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కేసీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే చర్చించారు. ఆ స్థానాన్ని మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నందకిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి ఆనంద్ కుమార్‌గౌడ్‌కు ఖాయమైనట్లు సమాచారం.