నాపై కాంగ్రెస్ నేతలు హత్యాయత్నం చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపణలు చేశారు. తన ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. 30 ఏళ్లుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు… వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారని ఆగ్రహించారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని నిప్పులు చెరిగారు.
ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి నా అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని పేర్కొన్నారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారన్నారు. దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోము… మా సహనం పరీక్షించొద్దని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని.. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నమ్మకం లేదన్నారు.