తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా పలు పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని నిర్వహిస్తుండగా తాజాగా ఈ జాబితాలో బీఎస్పీ చేరింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రెండు రోజులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న మాయావతి.. సూర్యాపేటలో జరగనున్న ర్యాలీ, బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం హైదరాబాద్ చేరుకోని ఓ హోటల్లో బస చేస్తారని.. ముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 107 స్థానాల్లో BSP అభ్యర్థులు బరిలో నిలిచిన దృష్ట్యా… సింగిల్ డిజిట్ సీట్ల గెలుపు లక్ష్యంగా నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.