‘మేడిగడ్డ’పై నేడు జైన్‌ కమిటీ ప్రాథమిక నివేదిక

-

మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బ్యారేజీ కుంగడానికి గల కారణాలను విశ్లేషించడానికి కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ రాష్ట్రానికి వచ్చింది. బ్యారేజీని పరిశీలించిన కమిటీ.. ఇవాళ ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనుంది. కట్‌ ఆఫ్‌ వాల్‌కు పైపింగ్‌ కారణంగా పునాదుల కింద ఉన్న ఇసుక క్రమంగా వెళ్లిపోయి పియర్స్‌కు నష్టం వాటిల్లిందని నిపుణుల కమిటీ ప్రాథమిక అభిప్రాయానికి వచ్చింది. అయితే కట్‌ ఆఫ్‌ వాల్‌కు పైపింగ్‌ జరగడానికి గల కారణం తెలుసుకొనేందుకు తదుపరి అధ్యయనం చేసే అవకాశం ఉందని సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ వద్ద కుంగి ఒక పియర్‌ దెబ్బతినడంతోపాటు దీనికి ఇరువైపులా ఉన్న పియర్స్‌లో కూడా కదలిక ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇందుకు గల కారణాలను విశ్లేషించేందుకు ఇంజినీర్ల నుంచి అదనపు సమాచారాన్ని కోరింది. కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలోని కమిటీ.. బ్యారేజీని పరిశీలించడం తోపాటు నీటిపారుదల శాఖ సీనియర్‌ ఇంజినీర్లతో వివరంగా చర్చించింది.

‘బ్యారేజీ పియర్స్‌కు ముందు కట్‌ ఆఫ్‌ వాల్‌కు(సీకెంట్‌ పైల్‌ పద్ధతిలో నిర్మాణానికి) పైపింగ్‌ ఏర్పడి క్రమంగా పియర్స్‌ వద్ద రాఫ్ట్‌ దిగువ నుంచి ఇసుక క్రమంగా వెళ్లిపోయింది. దీనివల్ల ఒక పియర్‌కు నష్టం వాటిల్లింది. దీనికి అటు ఇటు ఉన్న పియర్స్‌ కొంతమేర కుంగి ఉండవచ్చు. అయితే కట్‌ ఆఫ్‌ వాల్‌ వద్ద పైపింగ్‌ ఏర్పడటానికి కారణం తెలుసుకొని దీనిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.’ అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version