తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ప్రచార పర్వంలో ఇప్పటికే దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
ఇవాళ మహబూబాబాద్, వర్దన్నపేట, పాలేరు సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిర్వహించనున్న తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు ఇవాళ కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు రంగం సిద్ధం చేశారు. దాదాపు 80 వేల మందిని తరలించేలా జనసమీకరణ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు సభ అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు.