పాలమూరు-రంగారెడ్డికి 60 % నిధులు.. కేంద్ర మంత్రి హామీ

-

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60 శాతం నిధులిస్తామని కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్‌ హామీ ఇచ్చారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం రాత్రి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌… పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఙప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ప‌లు అనుమ‌తులు తీసుకున్నా ఇంకా హైడ్రాల‌జీ, ఇరిగేష‌న్ ప్లానింగ్‌, అంచ‌నా వ్యయం, బీసీ రేషియో, అంత‌రాష్ట్ర అంశాలు కేంద్ర జ‌ల సంఘం ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని వాటికి వెంట‌నే ఆమోదం తెల‌పాల‌ని కోరారు.

దీనిపై స్పందించిన గజేంద్ర షెకావత్ 2014 త‌ర్వాత, కేంద్రం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించ‌లేద‌ని చెప్పారు. ఆ విధానం ప్రస్తుతం అమ‌లులో లేద‌ని స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 60 శాతం నిధులు కేటాయిస్తామ‌ని షెకావత్ హామీ ఇచ్చినట్లు భేటీ తర్వాత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసిన నేతలు రాష్ట్రానికి అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా 2024లో కొత్తగా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి రాష్ట్రానికి అదనంగా అధికారుల‌ను కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version