తెలంగాణకు రెండు పర్యాటక ప్రాజెక్టులను మంజూరు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండు ప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వీటికి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని త్వరలోనే ప్రకటన వస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. కల్చర్-హెరిటేజ్ గమ్యస్థానాల్లో నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రకృతి పర్యాటకం గమ్యస్థానాల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు షార్ట్ లిస్టులో ఉన్నాయని తెలిపాయి.
మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భువనగిరి కోటకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి పంపింది. కల్చర్ – హెరిటేజ్, ఆధ్యాత్మికం, ఆకర్షించే గ్రామాలు, ప్రకృతి పర్యాటకం ఈ నాలుగు విభాగాలకు రాష్ట్రాల నుంచి వెళ్లిన పలు ప్రతిపాదనలను కేంద్రం ఇటీవల పరిశీలించింది. ఈ మేరకు తుది జాబితా రూపొందించింది. రాష్ట్రం నుంచి వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్ అయిదు జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో అయిదు ప్రతిపాదనలు వెళ్లాయి.