కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్‌డీఎస్‌ఏ కమిటీ.. ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ అయ్యర్‌

-

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలకు గల కారణాలను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్ను ఈ కమిటీకి ఛైర్మన్గా నియమించింది. ఈ కమిటీలో మరో ఐదుగురు సభ్యులున్నారు.

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగి, పియర్స్‌ దెబ్బతిన్న తర్వాత అనిల్‌ జైన్‌ నాయకత్వంలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ బృందం పర్యటించిన విషయం తెలిసిందే. మరో ముగ్గురు సభ్యుల బృందం అన్నారం బ్యారేజీలో సీపేజీని పరిశీలించింది. మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేయించగా బ్యారేజీల పటిష్ఠతను నిర్ధారించడంతోపాటు ఏమేం చర్యలు తీసుకోవాలనే విషయంలో సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని పంపాలని ఫిబ్రవరి 13న నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కేంద్ర జల సంఘం ఛైర్మన్‌కు, ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్‌కు లేఖ రాశారు. దీనిపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.. చంద్రశేఖర్‌ అయ్యర్‌ను ఛైర్మన్‌గా, డిజైన్స్‌, హైడ్రాలజీ తదితర రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులను సభ్యులుగా నియమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version