తెలంగాణలో గత కొద్దిరోజులుగా భానుడు ప్రతాపం చూపించగా.. రేపు, ఎల్లుండి మాత్రం ఎండలు కాస్త తగ్గుముఖం పట్టనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ తావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురనున్నాయని.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే గత పదిరోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగగా.. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. కాగా రానున్న రెండు రోజులపాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.