ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్నటువంటి తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తరువాత గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతుందని చెప్పారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సిస్ వర్కర్స్ వెల్పేర్ బోర్డులను ఏర్పాటు చేసి ఇందులో ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.
సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా తానే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిఫ్పిన్, కేరళలో మంచి విధానం ఉందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానం పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికులు మరణించినట్టయితే రూ.5లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని.. రాబోయే రోజుల్లో రైతుబీమా మాదిరిగానే బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు.