తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇవాళ కేవలం ఒకే ఒక సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు తీవ్రంగా కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధమని.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీపైనా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.