ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడుతూనే మరోవైపు కేంద్రంలో మోదీ సర్కార్పై ధ్వజమెత్తుతున్నారు. పదేళ్లలో ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయమే చేశాయని మండిపడుతున్నారు. వరుస సభలు, కార్నర్ మీటింగుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.
ఇందులో భాగంగానే ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. నేడు కోరుట్లలో జనజాతర సభలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కోరుట్లలో ఈ సభకు హాజరవుతారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వస్తారు. మళ్లీ రాత్రి 7 గంటలకు కూకట్పల్లి కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. రేవంత్ సభ, కార్నర్ మీటింగులకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో బిజీ అయ్యారు.