సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన

-

తెలంగాణ సచివాలయం సమీపంలో భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, పార్టీ నేతలు వీహెచ్‌, షబ్బీర్‌ అలీ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఒక పక్క సచివాలయం.. మరో వైపు అమరవీరుల స్థూపం.. ట్యాంక్‌ బండ్‌పై ఎంతోమంది త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించానన్న సీఎం.. అదే రాజీవ్‌ గాంధీ విగ్రహం లేకపోవడం అని తెలిపారు.

భారత్ ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకుందంటే దానికి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో ఆయన ప్రాణాలు అర్పించారని.. దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. విగ్రహాలు పెట్టేది వర్ధంతి, జయంతికి దండలేసి దండం పెట్టుకోవడానికి కాదని.. సచివాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం పెడితే ఇటువైపు వచ్చే వారిలో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. ఒక ఆదర్శ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం తన జీవితాంతం గుర్తుంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news