తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రంగంరగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా తమ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ మంచి సూచన చేశారని.. తప్పకుండా సచివాలయం ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. ఈ విగ్రహం నమూనాల రూపకల్పన బాధ్యతను ఫైన్‌ఆర్ట్స్ కాలేజీకి అప్పగించామని వెల్లడించారు.
తెలంగాణ గీతం రాసిన అందెశ్రీ ఎవరని అంటున్న కేసీఆర్‌కు మానసిక స్థితి బాగా లేనట్టుందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ గీతం తయారీ బాధ్యతంతా అందెశ్రీకే అప్పగించామని.. గీతం పాడిందెవరనే దానికి ప్రాధాన్యం లేదని.. అధికారిక గీతం తయారు చేయాలని కమీషన్ల కోసం తాను ఎవరికీ కాంట్రాక్టు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో దశాబ్దాలుగా పాడుకున్న అందెశ్రీ గీతాన్ని గౌరవించామని.. తెలంగాణ అధికారిక చిహ్నంపై మార్పులు చేయాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ తన అభిప్రాయం ప్రభుత్వానికి చెప్పకుండానే, ముందుగానే ఎందుకు ధర్నాలు చేసింది? అని ప్రశ్నించారు.