డ్రగ్స్ కేసుల్లో సెలెబ్రిటీలున్నా, ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతిపై ఆరా తీశారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పని తీరుకన్నా మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని.. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని.. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని మార్గదర్శనం చేశారు. సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలని .. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాలు అనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలని అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.