గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రోజున స్థానిక టీఆర్‌పీ గేమ్ జోన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా అక్కడి ఉన్నవారిని వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడం వల్ల వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 27 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ఇందులో తొమ్మిదిమంది చిన్నారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృత దేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా కాలిపోవడం వల్ల మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు అంటున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులూ ఉన్నారని తెలిపారు.
రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రధాని మోదీ.. సహాయ చర్యల గురించి ఆరా తీశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొకరికి 50వేలు అందిస్తామన్నారు.