జనాభా తెలియకుంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలని అన్నారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీసీలను బలపర్చాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఏర్పాటు చేసిన బీసీ సంఘాల ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించగా.. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బలహీనవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధాని మోదీకి ఏం కష్టమొచ్చిందని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లోనూ ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.