ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించేలా.. ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రసంగాలు చేశాడని కొత్తగుడెం పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మార్చుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మే 3న జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడని, ఇన్ని రోజులు నేను చెప్పిందే దుష్యంత్ కుమార్ గౌతమ్ అధికారికంగా చెప్పాడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతోందని, బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలను వక్రీకరించి తప్పడు ప్రచారాలు చేస్తున్నారని. ప్రజలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియోలు, దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇంటర్వ్యూకు సంబందించిన వీడియో ఫుటేజీని ఫిర్యాదుకు జత చేసినట్లు తెలిపారు. అంతేగాక ఇటీవల కాలంలో అమిత్ షా వీడియోలు మార్ఫింగ్ కేసులో రేవంత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారని, అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రలు పన్నుతూ.. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు బీజేపీ ప్రతిష్టను, అవకాశాలను నేరుగా దెబ్బతీసేందుకు ఉద్దేశించబడినవిగా ఉన్నాయని రేవంత్ రెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.