తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పక్కా లెక్కలతో రంగం సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వివరాలను ప్రజలకు వివరించేందుకు సంసిద్ధమవుతోంది. గత సర్కార్ హయాంలో ఆదాయ వ్యయాలు, అప్పులు, వాటిని ఖర్చు చేసిన తీరుపై సమగ్ర అధ్యయనం చేస్తోంది. ఈనెల 20121వ తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి గ్యారెంటీ హామీల అమలుకు చట్టం తీసుకురావాలనే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది.
తెలంగాణపై అప్పుల భారం రూ.5 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు కొత్త ప్రభుత్వం తెలిపింది. వీటిపై నెలనెలా వడ్డీ రూపంలో భారీగా చెల్లించాల్సి వస్తుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు రూ.12,956.52 కోట్లను వడ్డీల కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు కాగ్ తాజా నివేదికలో తేలింది. ఆదాయ, వ్యయాలపై 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం తయారు చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించింది. మరోవైపు రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితులపైనా అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీ ఇచ్చినందున ప్రభుత్వం విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.