తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓవైపు తమ కేడర్‌ను బలపరుచుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు ఈసారి ఎలాగైనా సీఎం కేసీఆర్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఆ దిశగా ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ నేతలను రంగంలోకి దించి ప్రజల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నం మొదలు పెట్టాయి.
ఈ క్రమంలోనే ఈనెల 30న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే ఆ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ సభకు బ్రేక్ వేశాయి. ఇప్పటికే ఈనెల 22న జరగాల్సిన కాంగ్రెస్ సభ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా 30వ తేదీ నిర్వహించాలనుకున్న సభను కూడా వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ప్రియాంకగాంధీ సభ వాయిదా వేస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే.. వరద బాధితులకు పునరావాసం సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని రేవంత్ తెలిపారు.