టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా.. రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా.. వారి సమస్యలపై పోరును ఉద్ధృతం చేసేందుకు కాంగ్రెస్ సమాయమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తొలుత ఇవాళ్టి నుంచే ఈ దీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన టీపీసీసీ.. అంతర్గత విభేదాల వల్ల తేదీలను మార్చింది.
ఇవాళ నల్గొండలో జరగాల్సిన నిరసన సభను ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచన మేరకు ఈనెల 28కి వాయిదా వేశారు. ఈనెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే1న రంగారెడ్డి జిల్లాలో.. నిరుద్యోగ నిరసన సభలు నిర్వహించాలని హస్తం నేతలు నిర్ణయించారు.
రేణుకా చౌదరి ఆధ్వర్యంలో ఈ నెల 24న ఖమ్మంలో ఏర్పాటు చేయతలపెట్టిన నిరుద్యోగ నిరసన సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. ఆమెతో పాటు రేవంత్‌రెడ్డి, నాయకులు షబ్బీర్‌అలీ, బలరాం నాయక్, సురేష్ షెట్కర్, అంజన్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు మే 4 లేదా 5న హైదరాబాద్ సరూర్‌నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రియాంక గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇందులో భాగంగానే అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లపై కాంగ్రెస్ దృష్టి సారించింది.