కెసిఆర్, కేటీఆర్ కవిత హరీష్ రావు ఇలా టిఆర్ఎస్ పార్టీలో నాయకులందరికీ ప్రధాన రాజకీయ శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే. రాజకీయ ప్రత్యర్థుల యందు రేవంత్ రెడ్డి వేరయా అన్నట్లుగా ఆయనతో వ్యవహారం ఉంటుంది. రాజకీయంగాను, వ్యక్తిగతంగాను రేవంత్ టిఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఏ విషయం పైన, అనర్గళంగ మాట్లాడగలగడం , శత్రువులను సైతం ముప్పుతిప్పలు పెట్టి ప్రజల్లో వారిపై చర్చ జరిగే విధంగా చేయగలగడం లో రేవంత్ బాగా ఆరితేరి పోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా, రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. టిఆర్ఎస్ నాయకులు అందర్నీ టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు నడుపుతున్నారు.
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పై ఫోకస్ పెట్టింది. అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజకీయ వ్యూహాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు ను రంగంలోకి దింపి పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉండేలా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ని ప్రచారానికి దింపి టిఆర్ఎస్ హవాకు బ్రేక్ వేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దుబ్బాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు. కానీ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ టిఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల నుంచి కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ టిఆర్ఎస్ కు సంపూర్ణంగా బలం ఉంది. కవిత గెలుపుకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు కవితను టెన్షన్ పెట్టే విధంగా నిజామాబాద్ రాజకీయాలపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ను ఓడించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాలని చూస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ అసంతృప్తులతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం నిజామాబాదులో 824 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా, అందులో 570 మంది టిఆర్ఎస్ కు చెందిన వారు కాగా, కాంగ్రెస్ కు 152 మంది, బీజేపీకి 78 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
మరో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్రులుగా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కవిత గెలుపు నల్లేరు మీద నడకే. కానీ ఇప్పుడు రేవంత్ రంగంలోకి దిగి కవితకు కు గెలుపు అవకాశాలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తుండటంతో టిఆర్ఎస్ లో కంగారు మొదలైంది. ఇప్పటికే కవిత నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ వైరాగ్యంలోనే ఉన్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అలాగే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా దూరంగానే ఉంటున్నారు. దీంతో కవితను ఎమ్మెల్సీగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి పార్టీలో ప్రభుత్వంలో ఆమెను యాక్టివ్ చేయాలని కెసిఆర్ అభిప్రాయపడుతుండగా, ఇప్పుడు రేవంత్ రంగంలోకి దిగి పరిస్థితిని తారుమారు చేసేలా ఉన్నారు అనే టెన్షన్ టిఆర్ఎస్ లో నెలకొంది.
-Surya