తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ విజయభేరి సభకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అని సోనియా గాంధీ తన ప్రసంగం మొదలుపెట్టారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
అంతకుముందు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మాట్లాడారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని అశోక్ గెహ్లోత్ అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని తెలిపారు. సోనియా గాంధీ తన కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. రెండుసార్లు అవకాశం వచ్చినా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయలేదని.. దేశం కోసం అనుభవజ్ఞులైన మన్మోహన్ సింగ్‌నే ప్రధానిగా చేశారని తెలిపారు.