గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ తమిళనాడు ఫార్ములా…?

-

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటి వారిని కట్టడి చేయాలంటే ఈ షరతు చక్కగా పనిచేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. తమిళనాడులో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాన్ని కోర్‌ కమిటీ భేటీలో ఠాగూర్‌ చెప్పారట. తమిళనాడులో ఎన్నిక ఏదైనా.. పోటీకి ఆసక్తికనబరిచేవారు ఎవరైనా డిపాజిట్‌ చేయాలనే నిబంధన ఉందట. దాంతో సగం తలనొప్పులు తగ్గాయని ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే ఈ ఫార్ములా తెలంగాణలో ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో అన్న సందేహాలు ఉన్నాయి.

టికెట్‌ ఇచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెడతారన్నది కాకుండా.. టికెట్‌ కావాలంటేనే పదివేలు డిపాజిట్‌ చేయాలని షరతు పెట్టింది. దరఖాస్తుతోపాటు… కొంత మొత్తం డిపాజిట్‌ కూడా చేయాలన్నది ఆ నిర్ణయంలో భాగం. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌దే ఈ ఆలోచన అట. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించే వారు ఎవరైనా అప్లికేషన్‌తోపాటు పదివేల రూపాయల చెక్‌ను జత చేయాలి. రిజర్డ్వ్‌ సీట్లలో పోటీ చేసేవారైతే 5 వేల రూపాయల చెక్‌ అటాచ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదేదో బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. టికెట్‌ రాని వారికి డిపాజిట్‌ వెనక్కి ఇవ్వరట. అయితే ఈ నిర్ణయం పై పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టికెట్‌ రాకపోతే.. కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలకు దిగడం.. గాంధీభవన్‌ను ముట్టడించడం కామన్‌. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా హడావిడి ఉంటుంది. పార్టీకి చిల్లి గవ్వ ఇవ్వకుండానే టికెట్‌ కావాలని కొట్లాడే నాయకులు.. రేపటి రోజున డిపాజిట్‌ చెక్‌ ఇచ్చాక టికెట్‌ లేదంటే ఊరుకుంటారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే నాయకుల మధ్య సమన్వయం లేదు. చాలా గ్రూపులు ఉన్నాయి. పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి టికెట్‌ రాకుండా ఉండేందుకు పోతే పోయిందని లక్ష రూపాయలు అనుకుని పదిమందితో అప్లికేషన్స్‌ పెట్టిస్తే.. పోటీ పెరగదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీనే స్వయంగా సర్వే చేసుకుని.. బలమైన అభ్యర్థి ఎవరో గుర్తించి వారికి టికెట్‌ ఇస్తే సరిపోతుంది కదా అని కొందరు వాదిస్తున్నారట. ఒకవేళ బలమైన అభ్యర్థి వేరే పార్టీ నుంచి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరితే అప్పుడు పరిస్థితి ఏంటి? అలా వచ్చిన వారికి టికెట్‌ ఇస్తే.. అప్పటికే ఆశలు పెట్టుకున్నవారు ఊరుకుంటారా? అప్పుడు మాత్రం కాంగ్రెస్‌లో రచ్చ జరగదా? దానికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version