వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాపై పడే భారంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పంట బోనస్ వల్ల ఒక్కో సీజన్‌కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. రేషన్ కార్డులు, హాస్టళ్లు, ఇతర అవసరాలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారని, ఇకనుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది.
పలు జిల్లాల్లో ఇప్పటికే 50 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని మంత్రిమండలికి అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్‌లో సాగుచేసే పంటలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయశాఖకు పలు సూచనలు చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపిన ‘జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ’ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికపై చర్చించింది. మరమ్మతుల అనంతరం నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుందా అన్నది పరిశీలించాలని నిర్ణయించింది.