హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విచారణ వేగంగా సాగుతోందని పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కారు ప్రమాదానికి నిజామాబాద్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కారణమని తెలిసిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు పరారయ్యాడని వివరించారు. ప్రమాదానికి కారకుడైన తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించాలని ప్రయత్నించినట్టు గుర్తించామని డీసీపీ వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని డీసీపీ అన్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. గతంలో కూడా రాహిల్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో ఇదే తరహాలో కారు నడపాడని, అప్పుడు ఒకరు మృతి చెందినట్టు చెప్పారు. గత కేసును కూడా సమీక్షించి చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది : ఈనెల 23వ తేదీన తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో ప్రజా భవన్ వద్ద బీభత్సం సృష్టించాడు. వేగంగా దూసుకొచ్చి అక్కడి బారికేడ్లను ధ్వంసం చేశాడు. వాహనం నడిపింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అని పోలీసులు గుర్తించారు.